'బేటీ బచావో' కేవలం నినాదానికే పరిమితమా?: మోదీకి కేటీఆర్ ప్రశ్న

  • బండి సంజయ్ కుమారుడిపై ఆరోపణలు వచ్చాయన్న కేటీఆర్
  • బండి సంజయ్‌పై ఏం చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్న
  • రాహుల్ గాంధీ హైదరాబాద్ వచ్చి బాధితురాలిని పరామర్శిస్తారా అని నిలదీత
బీజేపీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెబుతున్న 'బేటీ బచావో' కేవలం నినాదానికే పరిమితమా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. మైనర్ బాలికకు వేధింపుల ఆరోపణల నేపథ్యంలో, కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ కుమారుడిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని ప్రధానిని ప్రశ్నించారు. కేంద్రమంత్రి తనయుడు కాబట్టి ఆయనకు మినహాయింపు ఉంటుందా అని నిలదీశారు.

కుమారుడిపై వచ్చిన ఆరోపణలకు గాను, బండి సంజయ్‌ను మంత్రి వర్గం నుంచి ఎప్పుడు బర్తరఫ్ చేస్తారని ప్రశ్నించారు. ఇదే అంశంపై ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా విమర్శలు గుప్పించారు. తెలంగాణలో మీ పార్టీ 'జంగిల్ రాజ్' ఎలా నడుపుతుందో చూడాలని రాహుల్ గాంధీని ఉద్దేశించి అన్నారు.

ఒక మైనర్ బాలిక పూర్తి ఆధారాలతో వస్తే, పోలీసు శాఖ వేగంగా ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఇతర పోక్సో నేరస్తుల మాదిరిగానే బండి సంజయ్ కుమారుడిపై ఎందుకు విచారణ జరపడం లేదని ప్రశ్నించారు. ఈ అంశంలో తిరిగి మైనర్ బాలికపై కేసు పెట్టడమేమిటని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ హైదరాబాద్ వచ్చి బాధితురాలికి, ఆమె కుటుంబానికి అండగా నిలబడతారా అని ప్రశ్నించారు. బీజేపీకి తెలంగాణ కాంగ్రెస్ ఒక ఫ్రాంచైజీలా పనిచేస్తున్నట్లు కనిపిస్తోందని విమర్శించారు. మైనర్ బాలిక విషయంలో కాంగ్రెస్, బీజేపీలు ఒక అపవిత్రమైన, అసహ్యకరమైన ఒప్పందానికి వచ్చాయా అని ధ్వజమెత్తారు.

పదిహేడేళ్ల బాధితురాలు, ఆమె కుటుంబం ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయించుకోవడానికి మూడు నెలలకు పైగా ఎందుకు పోరాడాల్సి వస్తోందని ప్రశ్నించారు. మైనర్ బాలిక రెండుసార్లు ఆత్మహత్యాయత్నం చేసిందని అన్నారు. న్యాయం కోసం మూడు నెలలుగా తిరుగుతున్నప్పటికీ వారిని పట్టించుకోలేదని విమర్శించారు. ఆడబిడ్డల రక్షణ కోసం ప్రభుత్వంతో కూడా ఎంతవరకైనా పోరాడుతామని హెచ్చరించారు.

KTR
K Taraka Rama Rao
Bandi Sanjay
Bandi Sanjay son
Telangana
BRS
BJP
POCSO Act
Minor girl harassment case
Rahul Gandhi

More Telugu News